పట్టువదలని విక్రమార్కుడు “సుబ్రహ్మణ్యన్ స్వామి”

Image may contain: 1 person, smiling, close-up, text that says "SWAMY WINS!"

… 47 ఏళ్ల న్యాయపోరాటంలో విజయంసాధించిన ఘటికుడు మన సుబ్రహ్మణ్యన్ స్వామి.
.
బహుశా భారతదేశ న్యాయచరిత్రలోనే ఒక సుదీర్ఘమైన న్యాయపోరాటంగా చెప్పవచ్చు. 1972 లో తనను ఆకస్మికంగా తొలగించిన ఐఐటి- ఢిల్లీపై కేసువేసి 47 సంవత్సరాలపాటు న్యాయ పోరాటం చేసి విజయం సాధించాడు. తన జీతాన్ని 8% వడ్డీతోసహా కలిపి సుమారు 40 లక్షల రూపాయలకు పైగా పొందాడు.
.
అప్పటికే అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో బోధిస్తున్న స్వామిని 1969 లో “Delhi School of Economics” లో బోధించాల్సిందిగా అప్పటి అధిపతిగా ఉన్న అమర్త్య సేన్ ఆహ్వానించారు. సేన్ హామీతో హార్వర్డ్ ను వదులుకొని ఢిల్లీకి వచ్చాడు స్వామి. అయితే చివరినిముషంలో స్వామి నియామకాన్ని రద్దుచేసినట్లు తెలిపాడు అమర్త్య సేన్. హతాశుడైన స్వామి సేన్ ను నిలదీస్తే ఆయననుండి వచ్చిన సమాధానం “మీ నియామకాన్ని కమ్యూనిస్ట్ విద్యావేత్తలందరూ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా ఇందిరాగాంధీ సోషలిస్ట్ పాలసీలపైనా భారత అణు కార్యక్రమంపైనా మీకున్న వ్యతిరేకత వలనకూడా మీ నియామకంపై వ్యతిరేకత ఉంది” కాబట్టి నేనేమీ చేయలేను, ఇక మీదారిమీరు చూసుకోండి అంటూ చావుకబురు చల్లగా చెప్పాడు సేన్.
.
ప్రత్యామ్న్యాయం కోసం చూస్తున్న స్వామికి, ఢిల్లీ ఐఐటీలో ప్రొఫెసర్ గా నియమించారు అప్పటి సెలెక్షన్ కమిటీ ఛైర్మెన్ గా ఉన్న “మన్మోహన్ సింగ్” గారు (అవును మన మాజీ ప్రధాని సింగ్ గారే). అయితే 1972 లో ఎటువంటి నోటీసూ ఇవ్వకుండా స్వామిని ఉన్నఫళంగా ఐఐటీ ఢిల్లీ నుండి తొలగించారు. అంతేకాకుండా, అదే ఐఐటీ లో కాంట్రాక్టు పద్ధతిపైన మ్యాథమెటిక్స్ బోధిస్తున్న స్వామి భార్యను కూడా తొలగించి, ఇద్దరినీ అక్కడి స్టాఫ్ క్వార్టర్స్ నుండి పంపించివేశారు.
.
ఇలా తొలగించడానికి కారణం, ఇందిరా అవలంబిస్తున్న సోవియట్ ప్రభావిత నెహ్రు సోషలిస్ట్ ఆర్ధిక పాలసీలను తీవ్రంగా విమర్శిస్తూ “మార్కెట్ ఎకానమీ” యొక్క అవసరాన్ని నొక్కిచెబుతూ వ్యాసాలూ గట్రా రాసేవాడు. దీంతో ఇందిరకు ఒళ్ళుమండింది. ఈయన వ్యాసాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తూ దుయ్యబట్టింది. ఇక అంతే, మరుసటిరోజే స్వామికి ఉద్వాసన చెప్పవలసివచ్చింది. ఏకంగా ప్రధాని ఆగ్రహానికి గురైన వ్యక్తిని ఉద్యోగంలో కొనసాగించే సాహసం ఇందిరను ఎదిరించడమే. కాబట్టి ఎందుకొచ్చిన గొడవ అంటూ స్వామిని ఆయన భార్యనూ రాత్రికిరాత్రి రోడ్డున పడేశారు. – ఈ కమ్యూనిస్ట్ విద్యావేత్తలు కూడా స్వామిని తీవ్రంగా వ్యతిరేకించడానికి కారణం స్వామి గారి పాలసీలు, వారి ఆలోచనావిధానం మాత్రమే.
.
ఇలా రోడ్డుమీదపడి, మళ్ళీ అమెరికాకు వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్న స్వామిని జనసంఘ్ వాళ్ళు పిలిచి రాజకీయాల్లో చేరమన్నారు. కొంతకాలానికి అంటే 1974 లో రాజ్యసభకు పంపారు. – విధి ఎంత విచిత్రమైనదో చూడండి, నిన్నటివరకూ మేష్టారుగా ఉన్న స్వామి, అంతలోనే ఏకంగా ఇందిరా ఎదుట పార్లమెంటులో ఎంపీగా ప్రత్యక్షమయ్యాడు. – ఇక ఇద్దరికీ పేస్ టు పేస్ అన్నమాట. ఓవైపు ఎంపీగా ఉంటూనే స్వామి హార్వర్డ్ లో బోధనకూడా కొనసాగించాడు.
.
తనను అక్రమంగా తొలగించినందుకు స్వామి ఐఐటీ-ఢిల్లీ వారిపై కేసు వేశారు. దాదాపు ఇరవైఏళ్ళకు అంటే 1991లో కోర్టుతీర్పు వచ్చింది. స్వామి తొలగింపు అక్రమం అంటూ తీర్పునిచ్చి, స్వామిని మళ్ళీ వెళ్లి ఐఐటీ లో జాయిన్ కావాలంటూ ఆదేశించింది. మనస్వామి మళ్ళీ ఐఐటీ లో ప్రొఫెసర్ గా తిరిగి జాయిన్ అయ్యాడు. కేవలం ఒక్కటంటే ఒక్కరోజు మాత్రమే తన విధులు నిర్వర్తించాడు. మరుసటిరోజు రాజీనామా చేసాడు. రాజీనామా చేసీ చేయగానే, తన తొలగింపు అక్రమమని కోర్టు తీర్పునిచ్చింది కాబట్టి, 1972 నుండి 1991 వరకూ అంటే సుమారు 19 ఏళ్ల పాటు తనను విధులు నిర్వర్తించినట్లుగానే భావించాలంటూ, 19ఏళ్ల జీతాన్ని ఇవ్వాలని తన లీగల్ బుర్రతో ఐఐటీ వారిని కోరాడు స్వామి.
.
ఇక, అక్కడ మొదలైంది క్షుద్ర రాజకీయం.
.
అప్పటికే బోలెడంతమంది శత్రువులను మూటగట్టుకున్న ముక్కుసూటి స్వామిని, రాజకీయ శత్రువులందరూ ఏకమై అష్టదిగ్బంధనం చేశారు. స్వామికి జీతంగా ఇవ్వాల్సిన 19ఏళ్ల బకాయిలను ఇవ్వకుండా అనేకరకాల ఒత్తిడులు తెచ్చారు. ఈకేసు విషయంలో ఐఐటీ వారికి న్యాయపరమైన సలహాలు ఇచ్చింది “రామ్ జెఠ్మలానీ” మరియు ఆయన అనుంగు శిష్యుడు “అరుణ్ జైట్లీ”లు.
.
అప్పట్లో “రామ్ జెఠ్మలానీ” స్వామికి బద్ధశత్రువు. (తరవాతికాలంలో వీళ్ళు గొప్ప మిత్రులుగా మారిపోయారు, అది వేరే విషయం). స్వామి బకాయిలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించకుండా కమ్యూనిస్ట్ విద్యావేత్తలంతా ఏకమయ్యారు. రామ్ జెఠ్మలానీ అయితే రెచ్చిపోయాడు. ఐఐటీ -ఢిల్లీ వారికి డైరెక్ట్ బెదిరింపులు చేసేవాడు. హెచ్చరిస్తూ లేఖలు రాసేవాడు. స్వామి తరఫున ఎవరైనా న్యాయసహాయం చేయడానికి ముందుకొస్తే క్రిమినల్ చర్యలకు సిద్ధపడాల్సిందే అంటూ బహిరంగ ప్రకటన చేశాడు జెఠ్మలానీ. రామ్ జెఠ్మలానీ లాంటి మేరుపర్వతం ముందు స్వామికి మద్దతుగా ఒక్కరంటే ఒక్కరుకూడా లేరు.
.
ఇకపోతే, 1993లో జెఠ్మలానీ శిష్యుడైన “అరుణ్ జైట్లీ” ఐఐటీ – ఢిల్లీ వారికి ఒక దిక్కుమాలిన న్యాయసలహా ఇచ్చాడు. అదేమిటంటే, “1972లో తనను తొలగించినప్పటినుండీ 1991లో కేసు గెలిచేవరకూ 19ఏళ్లకాలంలో స్వామి హార్వర్డ్ లో బోధిస్తూ ఆర్జించిన ఆదాయాన్ని స్వామి ప్రకటించాలి. ఆ ప్రకటించిన మొత్తాన్ని ఐఐటీ వాళ్ళు స్వామికి ఇవ్వాల్సిన బకాయిలనుండి మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని స్వామికి ఇవ్వాలి”
.
కేసు విచారణకు వచ్చినప్పుడల్లా జైట్లీ పెట్టిన ఈ దిక్కుమాలిన కొంటె నిబంధనను కోర్టులో ఎగతాళి చేసేవాడు స్వామి. ఇలాంటి నిబంధన ఐఐటీ రూల్స్ లో ఎక్కడైనా ఉందా అంటూ నిలదీసేవాడు స్వామి. పైగా నా 19ఏళ్ల నా హార్వర్డ్ ఆదాయాన్ని లెక్కేస్తే, ఐఐటీ వాళ్ళు నాకు ఇవ్వడం కాదు కదా, నేనే ఉల్టా వాళ్లకు తిరిగి చెల్లించాలి అంటూ వాదించాడు. అసలంటూ లేని నిబంధనను చూపించి ఇలా వాదించడం ఏమాత్రం సరైంది కాదని గట్టిగా వాదించాడు. స్వామి కేసు విచారణకు వచ్చినప్పుడల్లా ఈ జైట్లీ నిబంధనను స్వామి ఎగతాళి చేస్తూ ఉండడంతో కోర్టుహాలు నవ్వులతో నిండిపోయేది.
.
1993లో అరుణ్ జైట్లీ ఇచ్చిన తలతిక్క న్యాయసలహాతోనే ఐఐటీ – ఢిల్లీ వాళ్ళు కోర్టులో వాదిస్తూ వచ్చారు. స్వామి శత్రుగా భావించే “వాజపేయి” ప్రభుత్వం ఉన్నసమయంలో ఐఐటీ యాజమాన్యం అన్నిరకాల ట్రిక్కులను ప్లే చేసి స్వామి బకాయిలను రానివ్వకుండా చూసుకొన్నారు. తరవాత వచ్చిన యూపీఏ ప్రభుత్వ హయాములోకూడా 1993లో జైట్లీ ఇచ్చిన న్యాయసలహామీదనే వాదిస్తూవచ్చాడు అప్పటి HRD మంత్రి కపిల్ సిబల్.
.
పదేళ్ల యూపీఏ హయాం అయ్యాక, 2014 లో మోడీ ప్రభుత్వంలో HRD మంత్రిగా ఉన్న “స్మృతి ఇరానీ” ఆతరవాత “ప్రకాష్ జవదేకర్” లు స్వామి విషయాన్ని తొందరగా తేల్చవలసిందిగా ఐఐటీ – ఢిల్లీ వాళ్ళను ఆదేశించారు. ఈ విషయం న్యాయస్థానాల్లో ఆలస్యమయ్యేకొద్దీ ఇచ్చేమొత్తం ఎక్కువవుతుందేతప్ప లాభంలేదు కాబట్టి ఈ విషయాన్ని కోర్టుబయటే తేల్చుకొని వివాదాన్ని ముగించాల్సిందిగా కూడా సూచించారు. అయినా మోడీ హయాంలోని ఐదేళ్ళలోకూడా ఒక్క ఇంచికూడా ముందుకు కదలలేదు. దీనికికారణం మంత్రిగా ఉన్న “అరుణ్ జైట్లీ”నే. – అందుకే మన స్వామి “అరుణ్ జైట్లీ” ని శకుని అంటాడు.
.
చివరాఖరుకు 2019 ఏప్రిల్ 8 వ తేదీన (అంటే మొన్నటి ఎన్నికలముందు జైట్లీ మంత్రిపదవి ఆల్మోస్ట్ పోయాక) కోర్టుతీర్పు వచ్చింది. స్వామి వాదనలు సరైనవి అంటూ కోర్టు తీర్పునిచ్చింది. 1972 నుండి 1991 వరకూ స్వామికి ఇవ్వాల్సిన జీతానికి ఆ 19ఏళ్లకు 8% వడ్డీతో కలిపి దాదాపు 40లక్షల రూపాయలకుపైగా పొందాడు మన హీరో స్వామి.
.
రాజకీయాల్లో కక్షసాధింపులు ఏస్థాయిలో ఉంటాయో, ముక్కుసూటితనం ఎన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతుందో ఈఒక్క ఉదంతం తేటతెల్లం చేస్తుంది. అడుగడుగునా శత్రువులతో సహవాసం చేశాడు స్వామి. గిట్టనివాళ్ళు ఆయనను నానామాటలూ అంటారు. కానీ స్వామి ఒక అరుదైన రత్నం లాంటివాడు. ఒక్కటంటే ఒక్కటికూడా అవినీతిమరక అంటనివాడు. అద్భుతమైన మేధస్సు, అంతర్జాతీయస్థాయి ఉన్నవాడు. స్వతహాగా ఆర్థికవేత్త అయిన స్వామి సలహాలూ – సూచనలూ మోడీ పాటించాలి.
.
స్వాభిమానంలోనూ – పట్టుదలతోనూ – మొండితనంలోనూ – హక్కుగా తనకు రావాల్సినదానికోసం ఎంతదూరమైనా వెళ్ళడానికి సిద్ధపడేవిషయంలోనూ స్వామి గారు నాకు స్ఫూర్తి.
.

Pic: pgurus.com

4 thoughts on “పట్టువదలని విక్రమార్కుడు “సుబ్రహ్మణ్యన్ స్వామి”

  1. More than his personal battle, I like swamy for his forthright views and his Hindu nationalist outlook. It seems Narendra Modi ji is not particularly fond of him.

    He should have been India’s finance minister. He is the right man for the job. Arun Jaitly and Nirmala Sitaraman both are not suitable for the finance portfolio.

    మెచ్చుకున్నవారు 2 జనాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s