కశ్మీర్ “ఇస్లామిక్ ఉగ్రవాదానికి ” ఏడువందల ఏళ్ళు. 

Kashmir Terrarism

“కల్హణుడు” రచించిన 12వ శతాబ్దపు రచన “రాజతరంగిణి” – కశ్మీర్ చరిత్రకు ఎటువంటి అనుమానాలకూ తావివ్వనటువంటి సాధికార గ్రంధం. 

రాజతరంగిణి ప్రకారం మనకుతెలిసిన కశ్మీర్ చరిత్ర దాదాపు ఐదున్నరవేల సంవత్సరాలనాటిది. క్రీస్తుకుపూర్వం 3450తో మొదలవుతుంది. ఈ ఐదున్నరవేల ఏళ్ళలో దాదాపు 4598 సంవత్సరాలపాటు సుమారు 134మంది హిందూరాజులు అవిచ్ఛిన్నంగా పరిపాలించారు. – ఈ హిందూ రాజుల పాలనను మరొక వ్యాసంలో వివరిస్తాను.. 

ప్రస్తుతవ్యాసంలో కశ్మీర్ ను రక్తసిక్తం చేసి, అసలైన కశ్మీర్ ఆత్మనే లేకుండా చేసి, ముస్లిం మెజారిటీగా మారడానికి తోడ్పడినటువంటి “ఇస్లాం ఉగ్రవాదం” గురించి చారిత్రిక అంశాలతో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. 
.

నేడు కశ్మీర్ ను పట్టిపీడిస్తున్న “సీమాంతర ఉగ్రవాదం” అన్నది ఎదో మూడునాలుగు దశాబ్దాలనాటి “పాకిస్తాన్ ప్రేరిపితమైన ఇస్లామిక్ఉగ్రవాదం” మాత్రమే కాదు సుమా. 
.
ఈ ఇస్లామిక్ఉగ్రవాదానికి ఏడువందలయేళ్ళ చరిత్ర ఉంది. 

సరిహద్దు ఆవలి నుంచి వచ్చిన విదేశీయులు జిహాద్ పేరిట భయానక నరమేధాన్ని సాగిస్తూ, హిందువులను వీలైన మేరకు ఊచకోతలు కోస్తూ, విచ్చలవిడిగా విధ్వంసానికి పాల్పడటం క్రీ.శ. 14వ శతాబ్దం నుంచీ నిరాఘాటంగా జరుగుతున్నది. నాటికీ నేటికీ తేడా ఒక్కటే. 

> ఈ కాలపు టెర్రరిజం విదేశీ పాలకుల పరోక్ష ప్రోద్బలంతో, అమాంబాపతు ఇస్లామిక్ మిలిటెంటు ముఠాల పేరుమీద, ప్రభుత్వంతో తలపడి రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్నది. 

> పూర్వకాలపు టెర్రరిజం దీనికంటే అత్యంతదారుణం. సరిహద్దు ఆవలి నుంచి వచ్చి వక్రమార్గాల్లో రాజ్యాన్ని ఆక్రమించిన విదేశీ పాలకుల, వారి వారసుల ప్రత్యక్ష పర్యవేక్షణలో… ప్రభుత్వపరంగానే, ఆధికారిక విధానంలో భాగంగానే జరిగింది. ఇస్లాంలో కలవటానికి సమ్మతించని ప్రజలపై క్రూరాతి క్రూరంగా విరుచుకుపడిన ఘోరకలి అది. 

మిగతా భారతదేశంలాగే కాశ్మీర్ లోనూ హిందూ పాలకుల అతి మంచితనమే ఆది నుంచీ అనర్థాలకు మూలహేతువు. శరణు వేడిన వాడికల్లా అభయమిచ్చి ఆదరించడం మన ఉదార ప్రభువులకు అలవాటు కదా. 14వ శతాబ్దం మొదట్లో కాశ్మీర రాజ్యాన్ని ఏలిన “దామ్రరాజు సింహదేవుడు” తన శరణుజొచ్చిన ఇద్దరు పరదేశులకు తన ఉదారస్వభావంతోనే ఆశ్రయమిచ్చి, జాగిర్లు కూడా కట్టబెట్టాడు. పెద్ద మనసుతో తాను చూపిన దయ, కాలక్రమంలో యమపాశమై తన మెడకే చుట్టుకుంటుందని, తాను పాలుపోసి పోసి శరణార్థులే ముందు ముందు కాశ్మీరీ హిందువులందరూ శరణార్థులవాదానికి కారకులవుతారని ఆ పిచ్చిమారాజు ఊహించలేకపోయాడు. అలా సింహదేవుడు ఆశ్రయమిచ్చిన ముష్కరుల్లో ఒకడి పేరు “రెంచన” – ఈయన టిబెట్ రాజవంశీకుడు. రెండోవాడు “షామిర్” – ఈయనది అఫ్గానిస్తాన్.

క్రీ.శ. 1320 లో చెంఘిజ్ ఖాన్ వంశీకుడైన “జుల్ఫి కాదర్ఖాన్” (డుల్స్) డెబ్భైవేల సైన్యంతో టర్కిస్తాన్ నుంచి దండయాత్ర చేయగా అతడి ధాటికి నిలవలేక కశ్మీర్ రాజు సింహదేవుడు పరారయ్యాడు. రాజ్యం అల్లకల్లోలంకాకుండా అతడి మంత్రి “రామచంద్రుడు” గద్దెనెక్కి మామూలు పరిస్థితుల పునరుద్ధరణకు ప్రయత్నిస్తుండగా అప్పటిదాకా కపట రాజభక్తి కనపరచిన “రెంచన” కొత్త రాజును ఖూనీ చేసి బలవంతంగా సింహాసనం అక్రమించాడు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రాకుండా చేయాలనుకుని తాను చంపిన రామచంద్రుడి కుమార్తె కోటరాణిని పెళ్ళాడాడు. జనాన్ని మచ్చిక చేసుకునేందుకు బౌద్ధాన్ని వదిలి హిందూమతాన్ని స్వీకరించాలని కూడా అతడు ప్రయత్నించాడు. కాని – మతాంతరీకరణల అలవాటు లేని కాశ్మీరీ బ్రాహ్మణులు అందుకు ఖండితంగా నిరాకరించారు. దాంతో “సెకండ్ బెస్ట్’ గా అప్పటికే కొద్దికొద్దిగా వ్యాప్తిలోకి వస్తున్న ఇస్లాం మతాన్ని పుచ్చుకుని రెంచన మహారాజు కాస్తా “సుల్తాన్ సద్రుద్దీన్” గా పేరు మార్చుకున్నాడు.

అలా మొదలైంది కాశ్మీర్ లో ముస్లిం పాలన. “రెంచన”ను ఇస్లాంలో కలుపుకున్నది మొదలుకుని రాజ్యాధికారాన్ని అతని ద్వారా విచ్చలవిడిగా దుర్వినియోగం చేసి “బుల్ బుల్ షా” అనే మహమ్మదీయ గురువు హిందువులను యమయాతనలు పెట్టాడు. ఇస్లాంను స్వీకరించని వారిని వెంటాడి వేటాడాడు. గురువుగారి మార్గదర్శకత్వంలో నయా సుల్తాన్ సద్రుద్దీన్ స్వయంగా వందలాది హిందూ ఆలయాలను, బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేసి, అంతదాకా కనీవినీ ఎరుగని మత విద్వేషాన్ని చవిచూపించి కాశ్మీరీల్లో భయోత్పాతం రేకెత్తించాడు. 

…. ఆ సద్రుద్దీన్ సుల్తాను కాశ్మీర్ పాలిట మొట్టమొదటి ఇస్లామిక్ టెర్రరిస్టు.

అదృష్టవశాత్తూ సద్రుద్దీన్ పీడ త్వరగానే తప్పింది. అధికారం లాక్కొని మూడేళ్లు తిరక్కుండానే అతడు మరణించడంతో పాతరాజు సింహదేవుడి తమ్ముడు “ఉదయనదేవుడు”రాజదండం అందుకున్నాడు. రాజకీయంగా బలపడటం కోసం “సస్రుద్దీన్కో” భార్య కోటరాణిని అతడు పెళ్లి చేసుకున్నాడు. ఇంతకు ముందు పేర్కొన్న రెండవ శరణార్థి అయిన “షామిర్” ఈ కొత్తరాజు ప్రాపకం పొంది మంత్రిగా పెత్తనం చలాయించాడు. పదిహేనేళ్ళు పరిపాలించాక 1338 లో ఉదయనదేవుడు కన్నుమూయగా ఆయనభార్య అయిన “కోటరాణి”కి పట్టం కట్టబోతున్న సమయంలో మంత్రిగా పెత్తనం చెలాయిస్తున్న “షామిర్” కుట్రచేసి రాణిని చెరబట్టి, ప్రధానమంత్రిని, ఇతర రాజోద్యోగులను రాత్రికి రాత్రి చంపించి రాజమకుటం గుంజుకున్నాడు. 

“సుల్తాన్ షంసుద్దీన్” గా తననుతాను ప్రకటించుకున్నాడు. “ఉదయనుడి” స్థానంలో తాను రాజవగానే అతడి భార్య కూడా తనకు భార్య అయిపోవాలనుకున్నాడు. కోటరాణిని నిర్బంధించి నిఖా చేసుకున్నాడు. విధిలేక పశు బలానికి తలవంచిన రాణి మొదటి రాత్రే కత్తితో పొడుచుకుని “నీతో పెళ్ళికి ఇదీ నా అంగీకారం’ అని పేగులను చూపించి నెత్తుటి మడుగులో కూలిపోయింది. 

రాణి విషయంలో తాను విఫలమైన పథకాన్నే కాశ్మీరీ హిందువుల మీదా ఈ షంసుద్దీన్ విస్తృతంగా ప్రయోగించాడు. హిందూ కుటుంబాలను విచ్చిన్నం చేసే దుర్బుద్ధితో హిందువులు, ముస్లింల మధ్య మతాంతర వివాహాలను పెద్దఎత్తున జరిపించాడు. ఇది ఇంకో రకం టెర్రరిజం. – మనం నేడు వింటున్న లవ్ జిహాద్ తరహా అనవచ్చేమో. 

తనకు పూర్వం ఉన్న “సద్రుద్దీన్” లాగే ఈ “షంసుద్దీన్” సుల్తాన్ కూడా కుట్రచేసి, గొంతులు కోసి గద్దెనెక్కిన మూడేళ్ళకే గోరీలో చేరాడు. అతడి అనంతరం పెద్దకొడుకు రాజు కాగా ఏడాది తిరక్కుండానే చిన్నకొడుకు యుద్ధం చేసి అన్నను గెంటేసి కిరీటం తాను లాక్కున్నాడు “షాఉద్దీన్”. ఈయన పాలనాకాలంలో వందలాది హిందూ దేవాలయాలను జయప్రదంగా నేలమట్టం చేశాడు. అతడి బాధ భరించలేక సొంత రాణే విడాకులిచ్చింది. “షాఉద్దీన్” కాలం చేశాక హిందువులను వేధించే డ్యూటీని అతడి తమ్ముడు “కుతుబుద్దీన్” తీసుకున్నాడు. ఆయన గారి పదహారేళ్ల పాలనలో “సయ్యద్ అలీ హందానీ” అనే మతోన్మాది పర్యవేక్షణలో బలవంతపు మతమార్పిడులు యథేచ్చగా జరిగాయి. కాశ్మీరీ హిందువుల మెడ మీద కత్తి పెట్టి మతం మారతావా చస్తావా అని అడిగేవారు. మారతానంటే ప్రాణం దక్కేది. మారకపోతే తల తెగేది. ఆ ప్రకారంగా తెగిన తలలకు లెక్కలేదు. అది రాజు సాగించిన టెర్రరిజం. 

ఇదే దారుణమనుకుంటే దీనికి నూరింతల ఘోరం ఆ తరవాత (1389-1413). కాశ్మీర్ ను ఏలిన ‘విగ్రహ విధ్వంసకుడు’ “సికిందర్”ది. ఆయనకికూడా గురువు “సయ్యద్ అలీ హందానీ” గారే. సికిందర్ సుల్తాన్ ఎంత క్రూరుడంటే హిందూ దేవాలయాలు కూలగొట్టటానికి ఏకంగా ఒక గవర్నమెంటు డిపార్టుమెంటునే ఏర్పాటుచేశాడు. కశ్మీర రాజ్యంలోని ఏ పల్లే, ఏ పట్నమూ క్రమపద్ధతి ప్రకారం అతడు జరిపించిన ఆలయ విధ్వంసం బారి నుంచి తప్పించుకోలేక పోయింది. “మార్తాండ్”లో ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయాన్ని మిగతా గుళ్ళలా కూల్చడం ఎంత ప్రయత్నించినా సికిందర్ మూకలకు సాధ్యపడలేదట. కూల్చలేనప్పుడు కాల్చటం మేలనుకుని, అడవి నుంచి పెద్ద పెద్ద దుంగలను తెప్పించి గుడినిండా పేర్చి నిప్పంటించారు. కాలే దుంగల వేడికి కొన్ని రోజుల తర కట్టడాలు పగులుబారాక పలుగులు, సుత్తులతో వాటిని కూల్చివేసేవారు. తాలిబన్లకు కూడా తెలియని ‘టెక్నిక్ ఇది. “పరాస్పోర్”, “అవంతిపుర”, “తపార్” తదితర ప్రాంతాల్లోని ప్రసిద్ధ దేవాలయాలనూ ఇదే పద్ధతిలో కూల్చారని పర్షియన్ చారిత్రిక పత్రాల్లో పేర్కొన్నారు.

తాలిబన్ల తాతల్లా విగ్రహాలను, ఆలయాలను ధ్వంసం చేయడంతోపాటు ను. శిల్ప కళలను, సంగీత వాద్యాలను కూడా సికిందర్ నిషేధించాడు. నుదుట తిలకం పెట్టుకోరాదని శాసించాడు. ఇస్లాంను స్వీకరించని హిందువుల మీద జిజియా పన్ను వేశాడు. ఇస్లాంమతం పుచ్చుకోని బ్రాహ్మణుల మెడల నుంచి తెంపిన యజ్ఞోపవీతాలను తూచితే ఏడు మణుగుల బరువు తూగాయట. బ్రాహ్మణుల జంధ్యాలను తెంచటంతో బాటు హిందువుల మత గ్రంథాలు ఎక్కడెక్కడ కంటపడ్డా కట్టగట్టి దాల్ సరస్సులోకి విసిరేయించిన ఘనుడు సికిందర్ సుల్తాన్. మరణించిన వారిని హిందు మతాచారం ప్రకారం తగలబెట్టనీయకుండా, కూల్చిన గుళ్లను తిరిగి కట్టుకోనివ్వలేదు. గుర్రం మీద ఎక్కి తిరిగేందుకూ, వేలికి ఉంగరం పెట్టుకునేందుకూ నోచుకోకుండా హిందువులపై సికిందర్ అడ్డగోలు ఆంక్షలు పెట్టి నానావిధాల వేధించాడు. రాజ్యంలో ముస్లింలు నివసించే ప్రాంతంలో ఇల్లు కట్టుకునేందుకు కూడా హిందువులను అనుమతించేవారు కాదు. కాశ్మీర్లో తాలిబన్ తరహా టెర్రరిజానికి అతడే ఆద్యుడు.

సికిందర్ మరణానంతరం 1413లో గద్దెనెక్కిన అతడి కుమారుడు అలీషా దుర్మార్గంలో తండ్రిని మించినవాడు. మతం మారని హిందువులను పగబట్టి వేటాడటంలో అతడు ‘విలక్షణ ప్రజ్ఞావంతుడు’. 1320లో ముస్లిం పాలన మొదలయ్యే సమయానికి కాశ్మీర్ ఆర్ష ధర్మానికి పట్టుగొమ్మగా, హిందూ మతానికి శిఖరాయమానంగా సంస్కృత సారస్వతానికి, భారతీయ కళలకు, వైదిక విద్యలకు నందనవనంలా భాసించి సంస విద్వాంసులతో ‘హిందూ పండిత కుటుంబాలతో, సాంప్రదాయక కళా ప్రవీణులతో కళకళలాడేది. అలాంటి చోట అలీషా ఏడేళ్లపాలన ముగిసే నాటికి కాశ్మీర్లో మిగిలిన పండిత కుటుంబాలు కేవలం పదకొండు. దీన్ని బటే ఊహించవచ్చు తండ్రి కి ఈ తడాఖా ఎంతటిదో.

అయితే – ఉత్పాతంలోనే ఒకింత స్వాంతన. 1420లో అలీషా మరణానంతరం అతని తమ్ముడు “బాద్షా జెయిన్ ఉల్ అబ్దిన్” గద్దెనెక్కాడు. సికిందర్, అలీషాలు ఎంత పాపాత్ములో ఈ బాద్షా అంత పుణ్యాత్ముడు. తండ్రి, అన్నల పాలసీలను పూర్తిగా మార్చి ఆయన హిందువులపై ఆంక్షలన్నిటినీ ఎత్తేశాడు. జిజియా పన్ను తీసేశాడు. గోవధను నిషేధించాడు.. ద్వంసమైన దేవాలయాలను పునర్నిర్మించుకోవటానికి అనుమతిచ్చాడు. స్వయంగా తానే శంకరాచార్యాలయం లాంటి కొన్ని హిందూ గుడులను పునరుద్ధరించాడు. హిందూ శాస్త్రాలను, మహాభారతాన్ని పర్షియన్లోకి అనువదింపజేశాడు. దమనకాండకు తట్టుకోలేక కాశ్మీర్ వదిలిపోయిన పండిట్లను వెనక్కి పిలిపించి యోగ్యతనుబట్టి బాధ్యతగల పదవులు అప్పగించాడు. బాద్షా ఖ్యాతిని విని భారతదేశం ఇతర ప్రాంతాలకు చెందిన కుటుంబాల వారు కూడా కాశ్మీర్ వెళ్ళి స్థిరపడ్డారు. మొగలాయీల కాలంలో అక్బర్ వలె కళలను, సంస్కృతిని, లౌకిక వృత్తులను ఆదరించి ప్రోత్సహించడం కూడా బాద్షా ప్రత్యేకత. రాజ్యమంతటా కాలవలు తవ్వించి, చవుడు భూములను సాగులోకి తెచ్చి ఆయన వ్యవసాయోత్పత్తిని ఊహాతీతంగా పెంచాడు. గ్రామంలో జరిగే నేరాలకు గ్రామ పెద్దది జవాబుదారీ చేసి, లంచగొండి అధికారులను కఠినంగా శిక్షించి, ఆహారపు అక్రమ నిల్వలను నిరోధించి, ధరలను నియంత్రించి, సమాచార వ్యవస్థను పటిష్టం చేసి ధర్మప్రభువు అనిపించుకున్నాడు. బాద్షా పాలించిన యాభై ఏళ్ళూ కాశ్మీరీలకు, ముఖ్యంగా కాశ్మీరీ హిందువులకు ముస్లిం హయాంలో స్వర్ణయుగం. 

ఎంత తీపి కలకైనా ముగింపు తప్పదు. “బాద్షా జెయిన్ ఉల్ అబ్దిన్” కాలధర్మంతో కాశ్మీర్ కథ మొదటికి వచ్చింది. బాద్షా ఎంత ఉత్తముడో ఆయన కుమారులు అంత అధములు. ఒకరిపై ఒకరు కుట్రలు పన్నడంలో, ఒకరిని మించిన చెడ్డ పేరు ఇంకొకరు తెచ్చుకోవటంలో మహాప్రవీణులు. తరవాతి సుల్తాన్ అయిన “హైదర్ షా” తాతగారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని హిందూ దేవాలయాలను వరసబెట్టి చేతనైన మేరకు కూల్చాడు. గద్దె మీద కూచోగలిగిన ఒక్క సంవత్సరంలోనే హిందువులను యథాశక్తి వేధించాడు. అతడి అనంతరం వచ్చిన సుల్తానులూ అంతఃపుర కుట్రలు, రాసలీలలు, పానగోష్ఠుల వంటి అత్యవసరాలకు వెచ్చించగా మిగిలిన సమయంలో లూటీలు, గృహ దహనాలు చేయించి ముస్లిమేతరులను చంపుకుతిన్నారు. 1489లో సుల్తాన్ అయిన “ఫతేషా” ఒక్కడే 24 వేల మంది కాశ్మీరీ హిందువులను మెడమీద కత్తి బట్టి ఇస్లాంలోకి బలవంతంగా మార్పింఛాడు . తాను కూల్చిన కాళికాలయంలోకి ప్రవేశించే దుస్సాహసానికి ఒడిగట్టిన నేరానికి మండిపడి, కనిపించిన కాశ్మీరీ పండిటుకల్లా ముక్కూ చెవులూ కోయించాడు. గత్యంతరం లేక ఇస్లాం మతం పుచ్చుకొన్నా నమాజ్ సమయంలో వైదిక మంత్రాలను లోలోన గొణుగుక్కొంటున్న 800 మంది ప్రముఖ హిందువులను సామూహికంగా తలలు నరికించాడు.

“కాజీచౌక్” అనే షియా మతస్థుడు కాశ్మీర్ లో సున్నీలను గెలిచి సుల్తాన్ అయ్యాక తన గురువు “షామ్స్ ఇరాకీ”గారి దర్శనానికి పోతే ఆయన దీవించి ‘పూర్తి అధికారం నీ చేతికి వచ్చింది కదా, దాన్ని ఉపయోగిచి కాశ్మీర్ కు ఇతర మతాల పీడ విరగడ చేసి హిందూ కాఫిర్ల భరతం పట్టమ’ని కర్తవ్య బోధ చేశాడట. ఇక ఆ ఆదేశాన్ని సుల్తాన్ గారు వెంటనే అమల్లో పెట్టి 1518 సంవత్సరంలో ఒక్కరోజునే 1800 మంది ప్రముఖ హిందువులను ఊచకోత కోయించాడని “బహరిస్తాన్-ఇ- షాహి” గ్రంథం చెబుతుంది. సుల్తాన్ల అసమర్థత అలసత్వాల మూలంగా, ముస్లింల్లోనే షియా – సున్నీల మధ్య ఘర్షణల కారణంగా అంటువ్యాధుల వ్యాప్తి, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల జాస్తి పర్యవసానంగా విశేష జననష్టం సంభవించి, ఆర్థిక వ్యవస్థ చితికి కాశ్మీర్ మొత్తం దీర్ఘకాలం దారుణ దురవస్థల పాలయిన పరిస్థితుల్లో కాశ్మీర్ రాజ ప్రముఖులు కొందరు చక్రవర్తి అక్బర్ కు కాశ్మీర్ ను కూడా మొగల్ సామ్రాజ్యంలో కలిపేసుకోమని అభ్యర్థన చేశారు. ఎటువంటి ప్రతిఘటనా లేకుండా 1589 లో మొగలాయిలు కాశ్మీర్ ను సునాయాసంగా వశం చేసుకున్నారు. 

అక్బర్, జహంగీర్, షాజహాన్ చక్రవర్తుల కాలంలో మొగల్ పాలన వల్ల కాశ్మీర్ కు అనేక లాభాలు చేకూరాయి. క్రమబద్ధమైన ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడి, ఆర్థిక స్తోమతు సమకూడి కాశ్మీర్ తెప్పరిల్లింది. దుర్మార్గపు మతాంతరీకరణల బెడద పోయి అరవై డెబ్బై ఏళ్పు అక్కడి హిందువులు కాస్తంత సుఖంగా ఉన్నారో లేదో 1659 లో కాలయముడిలా ఔరంగజేబ్ ఢిల్లీ పాదుషా అయ్యాడు. కన్నతండ్రిని ఖైదుచేసి, సోదరులను హతమార్చి సింహాసనం అధిష్టించినందుకు ఆ మతస్తులు తనను అసహ్యించుకోకుండా చూసుకోవటానికి ఔరంగజేబు రెట్టింది ఉత్సాహంతో ముస్లిం మతవ్యాప్తిని సాగించి ముహమ్మదీయేతరులను తీవ్రంగా వేధించాడు. ‘మతవిశ్వాసం లేని ద్రోహుల పాఠశాలలను, దేవాలయాలను నాశనం చేయమని తన సామ్రాజ్యంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వు చేశాడు. 

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? చక్రవర్తిగారు ఆజ్ఞాపించినదే తడవుగా అనుచరులు చెలరేగి కాశీ విశ్వనాథాలయాన్ని, సోమనాథ్ లో రెండో గుడిని, మధురలో కేశవాలయాన్ని, ఇంకా భారతదేశం దశదిశలా వందల, వేల దేవాలయాలను, హిందూ విద్యా సంస్థలను నేలమట్టం చేశారు. రాజపుత్రులు మినహా హిందువు లెవరూ పల్లకి ఎక్కరాదని, ఆయుధాలు ధరించరాదని, అనేక రకాల రాజోద్యోగాలకు వారు పనికిరారని, జిజియా పన్ను కట్టి తీరాలని దుర్మార్గపు ఆంక్షలు పెట్టారు. తిలకం బొట్టు, జంధ్యం పోగు ఎవరి దగ్గర కనిపించినా అవమానించి క్రూరంగా హింసించేవారు. ఒక్క కాశ్మీర్లోనే రోజుకు మణుగు బరువు జంధ్యాలు తెంపి పారేసేవారు. ఈ బాధలు పడలేక కాశ్మీర్ కు చెందిన హిందువులు కొందరు పంజాబ్ వెళ్లి తొమ్మిదో సిక్కు గురువు తేజ్ బహాదూర్ కు తమ గోడు మొరపెట్టుకున్నారు. ఆ తరవాత జరిగింది చరిత్రలో చెరిగిపోని ధీరోదాత్త, బీభత్స గాధ. – దానిలోతుల్లోకి పోవడం అప్రస్తుతం. 

ఔరంగజేబ్ మరణానంతరం మొగల్ సామ్రాజ్యం ఛిన్నాభిన్నం కావడంతో కాశీర్ కష్టాలు గట్టెక్కలేదు. పరిపాలన అస్తవ్యస్తమై, వరదలూ, కరవుల బారిన కాశ్మీర్ దుర్భర దైన్యం అనుభవిస్తున్న అరాజక స్థితిలో కాశ్మీరాన్ని మీ సామ్రాజ్యంలో చేర్చుకుని ఆదుకోవలసిందంటూ అఫాన్ రాజు “అహ్మద్షా అబ్దాలీకి” కాశ్మీరీ ప్రముఖులు కొందరు (రెండు శతాబ్దాలకు పూర్వం మొగలాయీలను వేడుకున్నట్టే) ఆహ్వానించారు. అదే అదననుకొని ఆయన చప్పున సైన్యాన్ని పంపి 1753 లో కాశ్మీర్ ను అవలీలగా ఆక్రమించాడు. దాంతో కాశ్మీరీల పరిస్థితి పెనం నుంచి పొయిలో పడ్డట్టయింది. 67 ఏళ్లు ఒడిదుడుకులూ, కుట్రలూ తిరుగుబాట్ల మధ్య సాగిన ఆఫ్గన్ల పాలన కాశ్మీర్ చరిత్రలో భయంకరమైన పీడకల. 67 ఏళ్ళలో 24 మంది గవర్నర్లు మారారు. వారూ వీరన్న తేడా లేకుండా అన్ని మతాల వారినీ నిలువుదోపిడీ చేసి అడ్డగోలు పన్నులను గోళ్లూడగొట్టి వసూలు చేసి సంపదను మొత్తం కాబూల్ కో మోసుకుపోయినా, అఫాన్ కిరాతకుల వక్రదృష్టి’ హిందువుల మీద మరీ ఎక్కువగా పడింది. “మీర్ ఫకీరుల్లా ఖాన్” అనే గవార్నర్ కాశ్మీర్ లోని సుప్రసిద్ద హిందూ విద్వాంసులందరినీ నిష్కారణంగా చంపించగా, “ఆజాద్ ఖాన్” అనే గవర్నరు మతం మార్పుకు ఒప్పుకోని నేరానికి హిందువులను గద్దిమూటల్లో కట్టేసి డాల్ సరస్సులోకి విసిరేయించే వాడు. చిట్టచివరి గవర్నరు “జబ్బార్ ఖాన్” పెడుతున్న చిత్రహింసలను భరించలేక సహనం నశించి కాశ్మీరీ పండిట్లు “మహారాజా రంజిత్ సింగ్” ను వేడగా ఆయన సేనలను పంపి 1819 తన అధీనంలోకి తెచ్చుకోవడంతో ఆఫ్గాన్ల బెడద పోయింది. 

దాదాపు ఇరవయ్యాయిదేళ్ళ తరవాత “రంజిత్ సింగ్” కు ఒకప్పటి సేనాని “గులాబీసింగ్” 75 లక్షల రూపాయలిచ్చి బ్రిటీష్ వారినుండి కొనుక్కోవడంతో 1846 మార్చి 16 నుంచి కాశ్మీర్ డోగ్రా వంశీకుల పరిపాలనలోకి వచ్చింది. ఈ వంశంలోని రాజైన “హరి సింగ్”ద్వారానే స్వాతంత్య్రం తరవాత ఈ జమ్మూ-కశ్మీర్ భారతదేశపు ఆధీనంలోకి వచ్చింది. – తదనంతరం పాకిస్థాన్ సాగించిన ఇస్లాం టెర్రరిజం మనం చూస్తున్న నడుస్తున్న చరిత్ర. 

1320 నుంచి 1819 వరకూ ఐదొందల ఏళ్లపాటు సాగిన ముస్లిం పాలనలో చెలరేగిన జిహాద్ లు – బలవంతపు మతమార్పిడులు – చారిత్రక టెర్రరిజాల భయానక కిరాతకాల సహజ పర్యవసానమే కొన్ని దశాబ్దాలుగా కాశ్మీర్ ను దహిస్తున్న అశాంతి.
.
నేడు కశ్మీర్ లో మనం చూస్తున్న “ఇస్లామిక్ టెర్రరిజం” అన్నది నిన్నామొన్నటి దశాబ్దాలక్రితం పాకిస్థాన్ ప్రేరిపితమైనది మాత్రమే కాదు సుమా, దీనికి 700 ఏళ్ల క్రూరమైన అమానవీయమైన చరిత్రవుంది. – చెరిపేస్తే చెరిగిపోయేది కాదు చరిత్ర.

3 thoughts on “కశ్మీర్ “ఇస్లామిక్ ఉగ్రవాదానికి ” ఏడువందల ఏళ్ళు. 

  1. ఆహా, ఆనాడు ఆ బ్రాహ్మణులు ఆ “రెంచన” రాజు గారిని బౌద్ధం నుండి హిందూ మతంలోకి రానిచ్చేస్తే కాశ్మీర్ చరిత్ర మరో రకంగా ఉండేదేమో కదా? సీరియస్లీ ….. ఉన్నా కొంత కాలమే ఉండుండేది లెండి. ఎందుకంటే తర్వాత కాలంలోనైనా ముస్లిం దండయాత్రలు జరగక ఆగలేదు కదా చరిత్రలో. వాటి ఫలితంగా ఆ టెర్రరిజం జరిగే ఉండేది.

    కనీసం ఇప్పుడైనా ఈ మార్పిడి విషయంలో హిందువులు తమ పట్టుదలను సడలిస్తే బాగుంటుంది. హిందూయిజం మతం కాదు, జీవనవిధానం … అనకుండా ఇతర మతాలవారెవరైనా హిందువుగా మారతానంటే ఆహ్వానించడం శ్రేయస్కరం అనిపిస్తుంది.

    మొత్తం మీద కాశ్మీరం గురించి ఒక భిన్న కోణంలో ఆసక్తికరమైన వ్యాసం వ్రాశారు 👌.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s